స్టార్ మాలో ప్రసారమవుతున్న 'బిబి జోడి' ఆసక్తికరంగా సాగుతోంది. నువ్వా నేనా అంటూ ఒక్కో జోడి తమ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో మెప్పిస్తున్నారు. శనివారం నాటి ఎపిసోడ్ లో 'జడ్జెస్ ఛాలెంజ్ రౌండ్' లో ఒక్కో జోడీకి ఒక థీమ్ ని ఇచ్చారు. అందరూ ఎవరికిచ్చిన థీమ్ ని వారు బాగా పర్ఫామెన్స్ చేసారు. ఒక్కో జోడీని జడ్జ్ లు బాగుంటే మెచ్చుకోవడం, లేకుంటే మిస్టేక్ చెప్పడం చేస్తారు. అయితే అక్కడ ఉన్న జోడీలలో ఎవరికి వారే స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే అభినయశ్రీ - కౌశల్ డ్యాన్స్ ఇరగదీసారు. ఆ విషయాన్ని జడ్జ్ లు కూడా బాగుందని చెప్పి మంచి స్కోర్ ని కూడా ఇచ్చారు. అయితే మిగిలిన జోడీలు స్కోర్ ఇచ్చే విషయంలో గొడవకు దారి తీసింది. 'ఫైమా- సూర్య జోడి తక్కువ స్కోర్ ఇచ్చారు. "కౌశల్.. మీరు డ్యాన్స్ చేయలేదు.. ఫీమేల్ డ్యాన్స్ ఎక్కువగా కన్పించింది. మధ్యలో ఫీమేల్ లిప్ సింక్ మీరు పాడారు. అందుకే స్కోర్ తగ్గించాం" అని ఫైమా చెప్పింది. "అసలు క్యాబ్ రే డ్యాన్స్ అంటే మీకేం తెలుసు" అని కౌశల్ అనగా.. మాటా మాటా పెరిగింది. ఒకరికొకరు వాగ్వాదానికి దిగారు. అప్పుడు రాధ కల్పించుకొని.. "ఫైమా.. డాన్స్ వాళ్ళు చెయ్యలేదంటే నేను ఒప్పుకోను.. స్కోర్ అనేది రీజనబుల్ గా ఉండాలి. దేని గురించి అయినా తెలుసుకొని మాట్లాడాలి. మీకు టైం వస్తుంది. అప్పుడు చూసుకోండి" అంటూ కౌశల్-అభినయశ్రీకి చెప్పింది రాధ.
మరొక జోడి అయిన అఖిల్- తేజస్విని వాళ్లు చేసిన పర్ఫామెన్స్ ని జడ్జిలు బాగుందంటూ అందరూ తెగ పొగిడేశారు. కానీ అభినయశ్రీ-కౌశల్ వాళ్ళు ఆ జోడీకి తక్కువ స్కోర్ ఇచ్చారు. దీంతో అఖిల్, కౌశల్ మధ్య గొడవ జరిగింది. మళ్ళీ రాధ కలుగజేసుకొని సర్దిచెప్పింది. అయితే ప్రతీసారీ జోడీలను స్కోర్స్ అడిగేటప్పుడు కావాలనే స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారని అవి గొడవలకు దారితీస్తున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. కాగా ఈ గొడవలు బిగ్ బాస్ ని తలపించేలా ఉన్నాయి.